Perfumes in lights వెలుగుల్లో పరిమళాలు

Imran Nausheen

కొవ్వొత్తులు తయారు చేయడం తేలికే! అయితే, సాదాసీదా కొవ్వొత్తులను విక్రయించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంటింటా చార్జింగ్‌ లైట్లు తిష్ఠవేసిన ఈ రోజుల్లో క్యాండిల్స్‌ తయారీని జీవనోపాధిగా ఎంచుకున్నది పాతబస్తీకి చెందిన ఇమ్రాన నౌషీన్‌. ఏ ప్రత్యేకతా లేకపోతే.. ఆమె గురించి ప్రస్తావించుకోవాల్సిన పనిలేదు. వెలుగులు పంచే కొవ్వొత్తులకు రంగులద్దింది. రకరకాల రూపాల్లో తీర్చిదిద్దడమే కాదు… కాంతులీనినంత కాలం పరిమళాలు వెదజల్లేలా వాటిని తయారుచేసింది. వెయ్యి రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి.. ఇప్పుడు ఇన్‌స్టా వేదికగా కస్టమైజ్డ్‌ క్యాండిళ్లను విక్రయిస్తున్న ఇమ్రాన నౌషీన్‌ స్టార్టప్‌ స్టోరీ చదివేయండి.

ఓల్డ్‌ సిటీకి చెందిన ఇమ్రాన నౌషీన్‌ మధ్య తరగతి గృహిణి. భర్త సంపాదనతోనే ముగ్గురు పిల్లలనూ పోషించేది. 2015లో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కోర్సులో శిక్షణ పొందింది. ఆర్థికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో తను నేర్చుకున్న కళతో ఏడేండ్ల తర్వాత ప్రయోగాలకు పూనుకొంది. మార్కెట్లో దొరికే పారాఫిన్‌ మైనం కొవ్వొత్తులను భారీ ధరకు విక్రయించడం చూసి, వాటిని తానెందుకు తయారు చేయొద్దు అనుకొంది.

ఆకట్టుకునే వైవిధ్యమైన రూపాల్లో ఫ్యాన్సీ క్యాండిల్స్‌ తయారు చేయాలనే లక్ష్యంతో వ్యాపారం మొదలుపెట్టింది. అప్పటికే మార్కెట్‌లో డిజైనరీ క్యాండిళ్లు అందుబాటులో ఉన్నా, సందర్భానుసారంగా వాటిని మార్చుకునే వీలు ఉండేది కాదు. పైగా వాటి ధరలు కూడా ఎక్కువ! ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నది ఇమ్రాన. తన సృజనాత్మకతను కరిగించి, కొనుగోలుదారులు కోరుకున్న డిజైన్స్‌లో ఫ్యాన్సీ క్యాండిల్స్‌ తయారుచేసే సంస్థను ప్రారంభించింది. సరసమైన ధరల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది.

మైనం కరగదు… దీపం ఆరదు..

ఇమ్రాన తయారుచేసే క్యాండిళ్లు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. చిన్న చిన్న ఆకృతులలో, నచ్చిన డిజైన్లలో కొవ్వొత్తులు తయారు చేస్తుందామె. అంతేకాదు వాటికి వేర్వేరు ఫ్లేవర్లను జోడించి పరిసరాలకు వెలుగుతోపాటు, సుగంధ పరిమళాలనూ అందిస్తున్నది. పారాఫిన్‌ మైనం, కెమికల్స్‌ కలిపి తయారు చేసిన సెంటెడ్‌ క్యాండిళ్ల కన్నా మన్నికైన కొవ్వొత్తుల ఉత్పత్తి ప్రారంభించింది.

వీటిని వెలిగిస్తే పొగ రాదు, మసి పట్టదు. మైనం కరిగిపోకుండా.. గంటల తరబడి వెలుగులు పూస్తాయి. సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. వీటిని ఒకసారి వెలిగిస్తే.. కనీసం 18 గంటలపాటు నిర్విరామంగా వెలుగుతూనే ఉంటాయి. తర్వాత కరిగిన వ్యాక్స్‌ జెల్‌ మళ్లీ ముద్దలా మారిపోతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా, పరిసరాల్లో తాజా వాసనలు వెదజల్లే క్యాండిళ్లను తయారుచేస్తూ మార్కెట్‌ పెంచుకుంది ఇమ్రాన.

కస్టమైజ్డ్‌ క్యాండిల్స్‌..

క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌, పుట్టినరోజు, పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాలు, పండుగలు, పర్వదినాలకు సరిపోయే విధంగా డిఫరెంట్‌ ఆకృతులలో క్యాండిళ్లను తయారుచేసే నైపుణ్యం కలిగిన ఇమ్రాన… తాజాగా ఫొటోలతో కూడిన కొవ్వొత్తులు కూడా కస్టమర్లకు అందిస్తున్నది. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్‌ నిర్వాహకులు ఈ తరహా క్యాండిళ్లను వినియోగిస్తున్నారు. చుట్టుపక్కల ఉండేవారు, బంధువులతో మొదలైన ఇమ్రాన అమ్మకాలు… క్రమంగా కార్పొరేట్‌ సంస్థలను చేరుకుంటున్నాయి. వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని ప్రయోగాలు చేస్తూ మూడు కొవ్వొత్తులు ఆరు కాంతిపుంజాలుగా తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నది.

వీ హబ్‌తో జీవం…

సరదాగా ఇంటి దగ్గర్నుంచి వ్యాపారం మొదలుపెట్టిన ఇమ్రాన పనితీరును వీ హబ్‌ గుర్తించింది. తన నైపుణ్యాలకు పదును పెట్టింది. ఇతర వేదికలపై ఇమ్రాన తయారుచేసిన ఫ్యాన్సీ క్యాండిళ్లను ప్రదర్శించుకునేలా స్టాల్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా క్యాండిల్‌ మేకింగ్‌, ముడిసరుకు కొనుగోలు, ఫ్లేవర్ల ఎంపిక, డిజైనరీ ప్యాకింగ్‌, లేబులింగ్‌, మార్కెటింగ్‌ వంటి అంశాల్లో ఆమెకు అవగాహన కల్పించి, ఇమ్రాన వ్యాపారానికి జీవం పోసింది.

వీ హబ్‌ మద్దతుతో అమ్మకాలు, మార్కెటింగ్‌ మెలకువలు, సోషల్‌ మీడియా నిర్వహణ తదితర అంశాలపై పట్టు సాధించింది. సాధారణ కొవ్వొత్తులే అయినా.. ఆమె సృజనతో వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాలో @jsmgel_candle ద్వారా విక్రయాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం కస్టమర్ల నుంచి మంచి ఆదరణ వస్తుండటంతో మార్కెట్‌ పరిధిని పెంచుకునేలా ఇ-కామర్స్‌ మార్కెటింగ్‌, సొంత వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించేందుకు ఇమ్రాన ప్లాన్‌ చేస్తున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని, పదిమందికీ ఉపాధి కల్పిస్తానని ఇమ్రాన ధీమాగా చెబుతున్నది.

Leave a Comment