A blessing.. a curse!

మహిళా శ్రామిక శక్తిని పెంచేందుకు తీసుకొస్తున్న కొన్ని చట్టాలు.. ఆడవాళ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వాల సూచనలు, కోర్టుల తీర్పులను చిన్నతరహా సంస్థలు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఫలితంగా, మహిళా ఉద్యోగులకు వరంలా ఉండాల్సిన చట్టాలు.. వారి ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి. ముఖ్యంగా.. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న తీర్పు.. మహిళా ఉద్యోగులకు శాపంగానే మారుతున్నది. బ్లూ కాలర్ జాబ్స్ ప్లాట్‌ఫామ్ ‘టీమ్‌లీజ్’ నిర్వహించిన పరిశోధన.. ఈ విషయాలను వెల్లడించింది.
మనదేశంలో ప్రసూతి ప్రయోజన చట్టాన్ని 2017లో సవరించారు. సంస్థ యజమాని చెల్లించే ప్రసూతి సెలవులను.. 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. అయితే, ఈ తీర్పు తర్వాత దేశంలో చిన్నసంస్థల నుంచి మహిళలకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం 22 శాతం తగ్గిందని సదరు పరిశోధన తేల్చింది.
ఈ సర్వేలో భాగంగా దేశంలోని 7,103 కంపెనీలలో.. 11,408 మంది పూర్తిస్థాయి ఉద్యోగుల డేటాతోపాటు 6,76,797 మంది సమర్పించిన ఉద్యోగ దరఖాస్తుల నుంచి వివరాలు సేకరించారు. ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం – 2017 ఆమోదించడానికి 17 నెలల ముందు, చట్టం అమలైన 19 నెలల తర్వాత కాలానికి చెందిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ సందర్భంగా చిన్నతరహా సంస్థల నుంచి మహిళలు ఇంటర్వ్యూ కాల్స్ అందుకునే అవకాశం.. 22 శాతం తగ్గిందని తేల్చారు. అయితే, ఈ విషయంలో చిన్నతరహా సంస్థల వాదనలు వేరుగా ఉన్నాయి.
మహిళలకు అధిక మొత్తంలో ప్రసూతి ప్రయోజనాలు కల్పించడం.. తమకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తున్నదని ఆయా సంస్థలు వాపోతున్నాయి. అదే సమయంలో.. పదివేల కంటే ఎక్కువమంది ఉద్యోగులున్న పెద్దపెద్ద కంపెనీల్లో మాత్రం ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదట. ఈ సంస్థలు ఎక్కువ మానవ వనరులను ఉండట కలిగి ఉండటం వల్ల.. ప్రసూతి సెలవులను అందించడానికి ఎలాంటి ఇబ్బందిపడటం లేదని తేలింది. ఏదేమైనా.. మహిళలను ఇలా ఉద్యోగాలకు దూరం చేయడం.. వారిపై వివక్ష చూపడమేనని పరిశోధకులు అంటున్నారు.