
జడ వేసినా ముడి వేసినా విరబోసినా దానికంటూ ఓ స్టైల్ ఉంటుంది. మనం వేసుకునే దుస్తుల్ని బట్టి హెయిర్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. పూలు మొదలు రాళ్ల బ్రూచ్‌ల దాకా సిగను ఎన్నో విధాలుగా సింగారిస్తాం. అందులోనూ ఎవరి మోడల్ వారిది. దేని ఆకర్షణ దానిది. అయితే జడ అలంకారంలో పూలు మినహాయిస్తే మిగిలినవి చేసేందుకు కాస్త శ్రమ అవసరం. సమయమూ పడుతుంది. మనం ఏ తరహా హెయిర్ స్టైల్ వేసినా దాన్ని చిటికెలో వావ్ అనిపించేలా చేసేందుకు ‘మిర్రర్ హెయిర్ స్టిక్ ఆన్ యాక్సెసరీలు’ వస్తున్నాయి.
ఇవే జడను అలంకరించే అద్దాలు. డైమండ్, త్రికోణం, బొట్టులాంటి మోడళ్లతో పాటు గుండ్రంగా ఉండేవీ ఇందులో వస్తున్నాయి. జడ వేసుకోవడం పూర్తయ్యాక అచ్చం బొట్టు బిళ్లలను అతికించుకున్నట్టు వెనక ఉన్న స్టిక్కర్ తీసేసి వెంట్రుకల మీద అతికించుకోవడమే. సాధారణమైన అద్దాల తరహాలో ఉండేవాటితో పాటు బంగారు రంగులోవీ ఇందులో దొరుకుతున్నాయి. అలంకారం చిటికెలో అయిపోవాలి, కొత్తగానూ కనిపించాలి అనుకుంటే ఇదో మెరుపులాంటి ఐడియా. జుట్టును తళతళా మెరిపించే ప్రక్రియ!