నేటి ఉరుకుల పరుగుల జీవితం.. మనిషికి ఊపిరాడకుండా చేస్తున్నది. ఆఫీస్ బాధ్యతల్లో, ఇంటి పనుల్లో ‘ఒత్తిడి’.. మానసికంగా చిత్తు చేస్తున్నది. బాధితుల్లో కోపం, అసహనం కూడా అధికమవుతున్నది. దీని ప్రభావం ఇంట్లో ఉండే చిన్నారులపై పడుతున్నది. కోపంతో పిల్లలను విపరీతంగా కొడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అయితే, ఇలాంటి ధోరణి.. పసివాళ్లపై మరింత దుష్ప్రభావం చూపుతుంది.

తమ తప్పు లేకున్నా.. తిట్లు, దెబ్బలు తినాల్సి రావడం వల్ల పిల్లల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ముఖ్యంగా, టీనేజీ పిల్లల్లో ‘ఇగో’ హర్ట్ అవుతుంది. దీర్ఘకాలంలో వారి మానసిక అభివృద్ధిపై దుష్ప్రభావం చూపుతుంది. ఇలాంటి పిల్లల్లో భవిష్యత్తులో ఆందోళన, నిరాశావాదం పెరుగుతుంది. అది మరింత ఎక్కువైతే.. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. ప్రతి విషయాన్నీ వారిని చూసే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమతో క్రూరంగా ప్రవర్తిస్తే.. వారుకూడా హింసా మార్గాన్నే ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. ‘ప్రతి సమస్యకూ.. కొట్టడం, తిట్టడమే పరిష్కారం!’ అనుకుంటారు. పెద్దయ్యాక హింసాత్మక ధోరణితోనే ప్రవర్తిస్తుంటారు. అదే.. తల్లిదండ్రులు శాంతంగా ఉంటే.. పిల్లలు కూడా అనుసరిస్తారు.
మీ ఆగ్రహావేశాలను పిల్లలపై చూపించడం వల్ల వారు తీవ్రమైన భయాందోళనకు గురవుతారు. మానసికంగానూ దెబ్బతింటారు. వారిలో ఉండే ఉత్సాహం నీరుగారిపోతుంది. తమ గురించి తామే తక్కువగా అంచనా వేసుకుంటారు. చదువులోనూ వెనకబడిపోతారు. కాబట్టి, కోపాన్ని, అసహనాన్ని తగ్గించుకోవడానికి వేరే మార్గాలను అన్వేషించాలి. యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి.
కోపం ఎక్కువైందని అనిపించినప్పుడు.. వెంటనే ఆ స్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. అక్కడే ఉండి కోపాన్ని పెంచుకోవడం, పిల్లలపై అరవడం కన్నా.. అక్కడినుంచి వెళ్లిపోవడమే మంచిది. టీవీ చూడటం, నచ్చిన పాటలు వినడం లాంటివి చేస్తే.. కొంచెం డైవర్ట్ అవుతారు. కోపం అదుపులోకి వస్తుంది.
ఇక చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలను కొట్టడం, తిట్టడం చేసిన తర్వాతే.. తమ తప్పును గుర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పిల్లలను దగ్గరికి తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాదని వారికి హామీ ఇవ్వాలి. అవసరమైతే.. పిల్లలకు క్షమాపణలు చెప్పాలి.